టెన్త్ విద్యార్థులకు మంత్రి సవిత శుభాకాంక్షలు
అమరావతి : నేటి ( మార్చి 17)నుంచి జరగబోయే టెన్త్ పరీక్షలకు హాజరుకాబోతున్న బీసీ హాస్టళ్ల విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఇతర విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో పాటు బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాబోతున్న నేపథ్యంలో మంత్రి సవిత ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థి జీవితంలో టెన్త్ పరీక్షలు ఓ మైలురాయన్నారు. ఎంతో ప్రాధాన్యమున్న పదో తరగతి పరీక్షల సమయంలో ఎటువంటి ఒత్తిడికీ లోను కావొద్దని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు హాజరు కావాలని సూచించారు. పది పరీక్షా ఫలితాల్లో ఎప్పటిలాగే ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్ల విద్యార్థులు సత్తా చాటాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తమ ప్రాంతం గర్వపడేలా ఉత్తమ ఫలితాలు సాధించాలని మంత్రి సవిత ఆకాంక్షించారు.