సదస్సులో మాట్లాడుతున్న దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ

దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ
స్వతంత్ర భారతంలో కులం,మతం – హింసపై సదస్సు

దేశంలో అణగారిన వర్గాల స్త్రీలు నిరంతరం అణచివేతకూ, హింసకు గురవుతున్నారని దళిత స్త్రీ శక్తి జాతీయ కన్వీనర్ గెడ్డం ఝాన్సీ అన్నారు. దళిత స్త్రీ శక్తి ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో స్వతంత్ర భారతంలో కులం, మతం-హింస అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఝాన్సీ మాట్లాడుతూ అణగారిన స్త్రీల జీవితం నిరంతరం రణరంగంగా మారిందనీ, యుద్ధభూమిలో వారంతా ఆధిపత్య శక్తుల హింసనీ, అవమానాలను భరించాల్సి వస్తోందన్నారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మణిపూర్ చోటుచేసుకున్న దుస్సంఘటనే దీనికి తార్కాణమన్నారు. సిగ్గు పడాల్సింది స్త్రీలు కాదు..యావత్భారత దేశం సిగ్గుపడాలి..ప్రజలను పరిపాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు పడాలి..నాగరిజక సమాజమని చెప్పుకుంటున్న ఈ సమాజం సిగ్గుపడాలని ఝాన్సీ వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతి ప్రొఫెసర్ అనిత మాట్లాడుతూ సైన్సూ, సాంకేతిక రంగం ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేస్తున్నా సమాజంలో స్త్రీలపై నిరంతరం కొనసాగుతున్న అఘాయిత్యాలు వేదనకు గురి చేస్తున్నాయన్నారు. మణిపూర్ అంటేనే భయమేస్తోంది..ఈ హింసకు ముగింపు లేదా అని వ్యాఖ్యానించారు. వాకపల్లి నుంచి మణిపూర్ వరకు స్త్రీలెవ్వరికీ వ్యక్తిగత భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రతి హింసలో మతపరమైన అంశాలు కూడా ముడిపడి ఉంటున్నాయన్నారు. అనుపమ మాట్లాడుతూ పితృస్వామిక వ్యవస్థ తాలూకు హింస మరో రూపంలో పెట్రేగిపోతుందన్నారు. కులాన్ని మార్చలేం కానీ మనుషుల్ని మార్చవచ్చు..కుటుంబాల్లో సంస్కరణలు వస్తేనే సమాజం బాగుంటుందన్నారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసయిందనీ, సోషల్ మీడియా ప్రభావంతో హింస మరింత పెరిగిందని మిగతా వక్తలు వ్యాఖ్యానించారు. పని స్త్రీలది..పెత్తనం పురుషులది..వ్యవస్థ మార్పు కోసం అందరం చైతన్యవంతమవ్వాలన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు బి.శ్వేత, బి.శ్రీదేవి, సత్య కామ జాబాలి, మేరీ నిర్మల, రోజా, లక్ష్మీ ప్రసన్న, శ్రీనివాస్, భాస్కర్ , వివిధ జిల్లాల మహిళా నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *