జీ 20 సదస్సు సన్నాహక సమావేశంలో మాట్లాడుతుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని

  •  దేశం గర్వించేలా సమన్వయంతో సదస్సు నిర్వహించాలి
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన ఇన్ఛార్జి మంత్రి విడదల రజని
  • జి-20 సదస్సు నిర్వహణపై మంత్రులు అమర్ నాథ్, సురేషలతో కలిసి సమీక్ష
  • రూ.157 కోట్లతో సుందరీకరణ పనులు, శాశ్వత అభివృద్ది కార్యకలాపాలు

విశాఖపట్టణం, మార్చి 25 : ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే జి-20 సదస్సు ద్వారా విశాఖ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు మరొసారి లభిస్తోందని, మహా నగరానికి ఇది తలమానికంగా నిలవనుందని వైద్యశాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ప్రణాళికాయుతంగా వ్యవహరించి సమన్వయంతో ముందుకెళ్లి దేశం గర్వించేలా జి-20 సదస్సును విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ను మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఒన్ ఎర్త్, ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఫ్యూచర్ అనే థీమ్తో ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖ కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగే జి-20 సదస్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్ నాథ్, ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఇతర అధికారులతో కలిసి శనివారం సాయంత్రం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన పద్దతులపై, తీసుకోవాల్సిన చర్యలపై ఆమె మార్గనిర్దేశం చేశారు. సుందరీకరణ పనుల కోసం రూ.157 కోట్ల నిధులను వెచ్చించినట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులను చేపట్టామని గుర్తు చేశారు.

జీ-20 సదస్సు ఏర్పాట్లపై చర్చిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులు

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పట్టణాభివృద్ది, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ఎలాంటి సమన్వయ లోపం లేకుండా, ఇబ్బందులు కలగకుండా సదస్సును విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు.
సమీక్షా సమావేశంలో భాగంగా జి-20 సదస్సుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి, కార్యక్రమ షెడ్యూల్ గురించి జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున మంత్రుల బృందానికి వివరించారు. ఈ నెల 27వ తేదీన కొంతమంది విదేశీయులు నగరానికి చేరుకుంటారని, 28న మిగిలిన వారందరూ విచ్చేస్తారని తెలిపారు. మూడు రోజుల పాటు ప్రధాన సదస్సు జరుగుతుందని వివరించారు. అతిథులను స్వాగతించేందుకు ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక హెల్ప్ డెస్కు ఏర్పాటు చేశామని తెలిపారు.

27వ తేదీన విచ్చేసిన అతిథులను నగరంలోని కైలాస ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను చూపిస్తామని చెప్పారు. ఆ రోజు రాత్రి 7.30 గంటలకు రాడిసన్ బ్లూ హోటల్లో వెల్కమ్ డిన్నర్ ఉంటుందని తెలిపారు.

28వ తేదీన రాడిసన్ బ్లూ హోటల్లో బ్రేక్ ఫాస్టు తర్వాత ప్రధాన సమావేశం హోటల్లోని కన్వెన్సన్ హాలులో జరుగుతుందన్నారు. అనంతరం 3.30 గంటల నుంచి 6.30 వరకు మూడు రకాల సమావేశాలు జరుగుతాయని వివరించారు. రాత్రి 7.30 నుంచి 9.30 వరకు అదే హోట్ల సమీపంలోని బీచ్లో గాలా డిన్నర్ ఉంటుందని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారని పేర్కొన్నారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 29వ తేదీన రాడిసన్ హోటల్ సమీపంలోని బీచ్లో యోగా, మెడిటేషన్, పౌష్టికాహార వినియోగంపై నిపుణుల చేత అవగాహన కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. అల్పాహారం అనంతరం రోజంతా మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ప్రధాన సమావేశం జరుగుతుందని వివరించారు.

30వ తేదీన ఉదయం 10.00 గంటల నుంచి 1.30 వరకు కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ ఉంటుందని, అనంతరం క్షేత్ర స్థాయి పర్యటన ఉంటుందని వివరించారు. దీనిలో భాగంగా ముడసర్లోవ, కాపులుప్పాడ ప్రాంతాల్లో విదేశీయుల పర్యటన ఉంటుందని దీనిలో భాగంగా స్మార్ట్ వాటర్ మేనేజమెంట్, మెగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరు, జిందాల్ కంపెనీ పరిధిలో నిర్వహించే వేస్ట్ మేనేజ్మెంట్ ఎనర్జీ తయారీ యూనిట్ పనితీరు గురించి వివరిస్తామని పేర్కొన్నారు.

31వ తేదీన విదేశీయులు తిరుగు పయనమవుతారని చెప్పారు. అనంతరం స్థానిక నిపుణుల చేత వివిధ అంశాలపై చర్చా సమావేశాలు జరుగుతాయని కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున వివరించారు. సీపీ సీహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ భద్రతా చర్యల గురించి వివరించారు.

సమీక్షా సమావేశంలో మంత్రులతో స్థానిక ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసు, వాసుపల్లి గణేష్ కుమార్, పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీ లక్ష్మి, జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జీవీఎంసీ కమిషనర్ రాజబాబు, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఆర్డీవోలు భాస్కర్ రెడ్డి, హుస్సేన్ సాహెబ్, డీఆర్వో శ్రీనివాస మూర్తి, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *