రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్‌ దగ్గరకు వెళ్లనవసరం లేదు

ఆఫ్‌లైన్‌ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి

ధాన్యం సేక‌ర‌ణ‌పై అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన‌ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రోడ్లపైన, వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులకు కీల‌క ఆదేశాలిచ్చారు.

సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
ఇప్పటికే వ్యవసాయ క్షేత్రాల నుంచి మిల్లులకు ధాన్యం రవాణా చేయడానికి అనుమతిచ్చాం. వర్షాల ప్రభావం ఉన్న జిల్లాల్లో గన్నీ బ్యాగ్‌ల కొరత లేకుండా చూడాలి. అవసరమైతే పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున గన్నీ బ్యాగ్‌లను ఆయా జిల్లాలకు తరలించాలి. రైతులు మిల్లులను సందర్శించడం, మిల్లర్లను కలవడం వల్ల రైతులపై అనవసరమైన ఒత్తిళ్లు తీసుకొస్తారు. ఇది ప్రతికూల సందేశానికి దారితీస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎఫ్‌టీవో జనరేట్‌ అవుతుంది. చెల్లింపుల విషయంలో ఏ ఒక్క రైతూ మిల్లర్‌ దగ్గరకు వెళ్లనవసరం లేదు. ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలి.

ఆఫ్‌లైన్‌ ద్వారా కొన్న వివరాలను 24 గంటల్లో ఆన్‌లైన్‌లో మార్చుకోవాలి. విరిగిన నూక శాతాన్ని అంచనా వేసేందుకు మినీ మిల్లుల సంఖ్యను పెంచాలి. ఆర్బీకేల ద్వారా నూక శాతాన్ని నిష్పక్షపాతంగా అంచనా వేయొచ్చు. అధిక తేమ, విరిగిన, పగుళ్లు, పలువలు మారడం, మొలకెత్తడం వంటి కారణాలతో కొనుగోళ్లను తిరస్కరించడం ద్వారా రైతులు ఇబ్బంది పడకుండా చూడాలి. వరి విస్తీర్ణం ఎక్కువగా ఉండి.. మిల్లింగ్‌ సామర్థ్యం తక్కువగా ఉన్న ఎన్టీఆర్, ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆధునిక రైసు మిల్లుల ఏర్పాటును ప్రోత్సహించాలి. కాగా ఆదివారం నాటికి కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో 6.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *